చరిత్రలో తొలిసారి సుప్రీం కోర్టు జడ్జీల ప్రెస్ మీట్..!

SMTV Desk 2018-01-12 13:05:01  supreem court judges, press meet, first time, letter, cheif justice

న్యూ డిల్లీ, జనవరి 12: గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు పాల్గొని సుప్రీంలో పాలనా వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ప్రతిష్ఠ దెబ్బతింటున్న వేళ విధిలేని పరిస్థితులలో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని దీనికి విచారం వ్యక్తం చేస్తున్నామని వారు తెలిపారు. సుప్రీంకోర్టు లో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రధాన న్యాయమూర్తి దేశానికి అవసరమని వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంగన్ గొగోయ్ లు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు పవిత్రత కాపాడకపోతే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని వారు ఉద్ఘాటించారు. ప్రధాన న్యాయమూర్తిని అభిసంసించాలా? వద్దా? అనేది దేశ ప్రజలే నిర్ణయించాలని వారు పేర్కొన్నారు. సుప్రీంలో జరుగుతున్న విషయాలపై వారు ఏడు పేజీల లేఖను విడుదల చేశారు.