భారత నౌకాదళ౦ అత్యంత పటిష్టం: రక్షణ మంత్రి సీతారామన్‌

SMTV Desk 2018-01-10 16:52:21  navy, defence minister, nirmala seetaraman, powerful, rivals, countrey

న్యూ డిల్లీ, జనవరి 10: ఎటువంటి ముప్పునుంచైనా దేశాన్ని రక్షించే పూర్తి సామర్థ్యం భారత నౌకాదళానికి ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పశ్చిమతీరపు నౌకాదళ పాటవ ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఈ ప్రదర్శనలో యుద్ధవిమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, మూడు జలాంతర్గాములు సహా పదికి పైగా యుద్ధనౌకలు పాల్గొన్నాయి. క్షిపణి ప్రయోగాలు, తుపాకులు, రాకెట్లతో కాల్పులు, ఒక నౌక నుంచి మరో నౌకకు సరఫరా, జలాంతర్గాముల నిరోధక కార్యకలాపాలు, గగనతలంలో శత్రుదాడులను నిరోధించడం, రాత్రివేళ యుద్ధ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లడం సహా క్లిష్టమైన నౌకాదళ కసరత్తును సీతారామన్‌ పర్యవేక్షించారని నౌకాదళ అధికారులు వెల్లడించారు. రక్షణ మంత్రి తొలుత ఐఎన్‌ఎస్‌ కోల్‌కతాలో ఎక్కారు. తర్వాత సముద్రజలాల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో సోమవారం రాత్రి గడిపారు. వాస్తవ పరిస్థితుల్లో ఈ విమాన వాహక నౌక పనితీరు ఎలా ఉంటుందో అంచనా వేయడానికి కృత్రిమంగా సృష్టించిన బహుళ ముప్పు వాతావరణంలో సీతారామన్‌ గడిపారని నౌకాదళం తెలిపింది. "పశ్చిమనౌకాదళం పాటవాన్ని స్వయంగా వీక్షించాను. దేశాన్ని ఎటువంటి ముప్పు నుంచైనా రక్షించే పూర్తి సామర్థ్యం భారత నౌకాదళానికి ఉందన్న విశ్వాసం నాకుంది."అని మంత్రి అన్నట్లు నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది.