జూన్‌ 28 నుంచి ప్రసిద్ధ అమర్‌నాథ్‌ యాత్ర

SMTV Desk 2018-01-10 16:21:45  amarnadh yatra, june 28, kashmir, nn vora

జమ్ము, జనవరి 10: ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది 60 రోజులపాటు కొనసాగనుంది. జ్యేష్ఠపూర్ణిమనాడు (జూన్‌ 28న) దీన్ని ప్రారంభించనున్నట్లు దేవస్థాన బోర్డు అధికార ప్రతినిధి పేర్కొన్నారు. బోర్డు సభ్యులతో సమావేశమైన అనంతరం బోర్డు ఛైర్మన్‌, రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా తేదీలను ఖరారు చేసినట్లు తెలిపారు. మరోవైపు దక్షిణ కాశ్మీర్‌ హిమాలయాల్లోని ఈ దేవాలయ పరిసరాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాలపైనా చర్చించామని, వీటిపై సమీక్షా పిటిషన్‌ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. దేవాలయ పరిసరాల్లో అందరూ నిశ్శబ్దం పాటించాలని ట్రైబ్యునల్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరసనలు వ్యక్తం కావడంతో.. గుహలో మంత్ర ఉచ్ఛారణలు, భజనలపై తాము ఎలాంటి నిబంధనలూ విధించడంలేదని ఎన్‌జీటీ స్పష్టతనిచ్చింది. మంచు లింగం ముందుకు వెళ్లినప్పుడు మాత్రం అందరూ నిశ్శబ్దంగానే ఉండాలని స్పష్టం చేసింది.