వచ్చే ఖరీఫ్ నుంచే ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి: మంత్రి పోచారం

SMTV Desk 2018-01-10 14:36:24  investment, formers, telangana govt, four thousand, khareef

హైదరాబాద్, జనవరి 10: తెలంగాణ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంది. దానికితోడు వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 4వేలు చొప్పున రైతులకు ముందస్తు పెట్టుబడి అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సాగుకు పెట్టుబడి మద్దతుపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమై చర్చించింది. సమావేశ అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ..రైతులకు పెట్టుబడి మద్దతు చెల్లింపు విధివిధానాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు 626 గ్రామాల్లో 62,371 మంది రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించామని చెప్పారు. పెట్టుబడి సాయం నేరుగా చెక్కుల రూపంలో ఇవ్వాలని ఎక్కువ మంది రైతులు కోరారని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 72 లక్షల మంది రైతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని పోచారం వెల్లడించారు. పెట్టుబడికి కటాఫ్ ఆలోచన లేదన్న మంత్రి రాష్ట్రంలో సాగులో ఉన్న భూమి కోటి ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 92.7 శాతం మంది రైతులకు 10 ఎకరాల లోపు భూమి ఉండగా 0.28 శాతం మందికి మాత్రమే 20 ఎకరాల పైగా భూమి ఉందని ఆయన వెల్లడించారు. ఈ పథకానికి ప్రతీ ఏటా ఐదారు వేల కోట్ల రూపాయాలు వరకు ఖర్చు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.