స్కీయింగ్‌లో తొలి పతాకం సాధించిన ఆంచల్‌ ఠాకూర్‌..

SMTV Desk 2018-01-10 13:51:47  skiing, turkey, Aanchal Thakur, Bronze medal, sloram race,

న్యూఢిల్లీ, జనవరి 10 : అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల ఆంచల్‌ ఠాకూర్‌ స్కీయింగ్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది. టర్కీలో ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డీ స్కీ(ఎఫ్‌ఐఎస్‌) ఆధ్వర్యంలో ఆల్‌పైన్‌ ఎజ్డర్‌ 3200 కప్‌ టోర్నీ నిర్వహించారు. మంగళవారం స్లాలోమ్‌ రేస్‌ కేటగిరీలో పాల్గొన్న ఆంచల్‌ కాంస్య పతకం నెగ్గింది. స్కీయింగ్‌లో భారత్‌ పతకం సాధించడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. “నా తొలి అంతర్జాతీయ పతకం. అఖరికి ఊహించనిది జరిగింది. టర్కీలో ఎఫ్‌ఐఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో మంచి ప్రదర్శన చేశాను” అని తెలిపిన ఆంచల్‌.. వన్‌ హిమాచల్‌, హిమాలయన్‌ గర్ల్స్‌ అని హ్యాష్‌ ట్యాగ్‌లను జత చేసింది. ఆంచల్‌ విజయంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. " స్కీయింగ్‌ విభాగంలో భారత్‌ పతకాల ఖాతాను తెరిచింది. టర్కీలో నిర్వహించిన ఎఫ్‌ఐఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కీయింగ్‌ పోటీల్లో కాంస్యం సాధించిన ఆంచల్‌ ఠాకూర్‌కు నా అభినందనలు" అని వెల్లడించారు.