ఉపరాష్ట్రపతిగా సంక్రాంతికి సొంతూరుకు వెళ్లనున్న వెంకయ్యనాయుడు

SMTV Desk 2018-01-10 12:40:40  Vice-President venkayyanaidu goes to nellore, sankranthi festival celebrations

నెల్లూరు, జనవరి 10 : దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా సంక్రాంతి పండుగని తన సొంత ఊరిలోనే జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఆరు రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేడు మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరి సాయంత్రం రేణిగుంటకి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లి అక్కడే రాత్రి బస చేసి ఉదయానే శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం, హెలికాఫ్టర్‌లో నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌కి వెళ్లి, రోడ్డు మార్గాన వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టుకి చేరుకుని అక్కడే బస చేయనున్నారు. తిరిగి 12న ఉదయం 8 గంటలకి స్వర్ణభారత్ ట్రస్టు నుంచి బయలుదేరి నెల్లూరు సర్ధార్ పటేల్ నగర్ లోని జపాన్ హౌస్‌లో జరిగే డెలిగేట్స్‌ భేటికి హాజరవుతారు. ఈ సమావేశానికి క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని, గవర్నర్ నరసింహన్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే, 13వ తేదిన స్వర్ణభారత్ ట్రస్టులో జరిగే వివిధ కార్యక్రమాల్లో వెంకయ్య పాల్గొంటారు. తదుపరి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సమావేశం అవుతారు. 14, 15 తేదీల్లో వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు, సొంతూరైన చవటపాళెం, శ్రీరామపురంలలో సంక్రాంతి పండుగ జరుపుకోవడంతోపాటు బంధువులు, గ్రామస్థులతో సమావేశవుతారు. తిరిగి 16వ తేది ఉదయం ప్రయాణం అవుతారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి రాకకు కేంద్ర, రాష్ట్ర భద్రత విభాగాలు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోపక్క వెంకయ్యనాయుడు రాకతో బంధువులు, గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నెల్లూరు నగరవాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు.