అజారుద్దీన్‌ అవమానించిన హెచ్‌సీఏ ..

SMTV Desk 2018-01-09 15:31:58  Mohammad Azharuddin, hca, vivek, hyderabad

హైదరాబాద్, జనవరి 9 ; హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)...ప్రస్తుతం ఆటలో కంటే వివాదాలకు కేరాఫ్ చిరునామాగా మారింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో కార్యదర్శి జేఎస్‌ నారాయణ సస్పెన్షన్‌తో వార్తల్లోకెక్కిన బోర్డు తాజాగా మరో వివాదంలో నిలిచింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తొలుత అజారుద్దీన్‌ను లోపలికి అనుమతించకుండా అవమానపరిచారు. దీంతో ఆయన సుమారు గంటకు పైగా బయటే వేచి చూడాల్సి వచ్చింది. అజారుద్దీన్‌ను అనుమతించకపోవడంపై కొంత మంది నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అతన్ని అనుమతించారు. ఈ విషయంపై అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. "భారత్ కు పదేళ్లు సారథిగా సేవలందించాను. క్రికెట్‌ గురించి జ్ఞానం లేని వారు హెచ్‌సీఏను నిర్వహిస్తున్నారు. కనీసం వీరు ఎప్పుడైనా వారి జీవితంలో బ్యాట్‌ లేదా బంతిని కూడా పట్టుకుని కూడా ఉండరు. అలాంటివారు క్రికెట్‌ సంఘాన్ని నిర్వహిస్తున్నారు. మీరంతా నా సభ్యత్వానికి మద్దతు తెలిపితే, సమస్యలకు పరిష్కార చర్యలు చూపిస్తాను " అని వెల్లడించారు.