వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి: జేడీఎస్

SMTV Desk 2018-01-08 16:54:15  hd kumaraswami, karnataka, jds, elections, lonely

బెంగళూరు, జనవరి 08: కర్ణాటకలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. ఓ పక్క ముందస్తుగా సమాచారాన్ని సేకరించడం, ఒపినీయన్‌ పోల్స్‌ నిర్వహించడంవంటి పనుల్లో మీడియా సంస్థలు నిమగ్నమవ్వగా, మరో పక్క రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్దమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి తమ ఎన్నికల ప్రణాళికలను వెల్లడించారు. తమ రాష్ట్రంలో హంగ్‌ పరిస్థితి ఏర్పడినా తాము మాత్రం కాంగ్రెస్‌ పార్టీతోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. తమ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ హవా లేదని, కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీకి అనుకూలిస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించామని మొత్తం 224 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని భావిస్తున్నామని చెప్పారు. కనీసం తాము 113 స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపారు. తమ రాష్ట్రంలో అవినీతికి పునాది వేసిందే బీజేపీ అని, అది కాంగ్రెస్‌ పార్టీలో మరింత ఎక్కువయిందని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా కర్ణాటక తీర ప్రాంతంలో ఘర్షణలు నిద్రలేపి విభజన వాదంతో కాంగ్రెస్‌, బీజేపీ లబ్ధిపొందాలని భావిస్తున్నాయని అయన అన్నారు.