తస్లీమా వీసా పొడిగింపు

SMTV Desk 2017-06-20 17:00:40  bangladesh, lajja, chaarkanya, visa, barth,

న్యూఢిల్లీ. జూన్ 20: బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసాను మరో ఏడాది పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పొడిగించింది. 2017 జూలై 23 నుంచి మరో ఏడాది వీసా గడవు పొడిగింపునకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు ఆమోదించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. స్వీడన్ పౌరురాలైన తస్లీమా 2004 నుంచి కంటిన్యూ బేసిస్ మీద ఇండియన్ వీసా పొందారు. స్వీడన్ పాస్‌పోర్ట్ ఆధారంగా ఆమెకు వీసా పొడిగిస్తూ వస్తున్నారు. 1994లో ఆమె రచనలు(లజ్జ, చార్కన్య, ది క్రేసేంట్ అండ్ ది పెన్) గాను ఇస్లామిక్ మత సంస్థల నుంచి ఆమెకు బెదరింపులు రావడంతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉంటున్నారు. గత రెండు దశాబ్దాల పాటు అమెరికా, యూరప్‌లో ఆమె తలదాచుకున్నారు. అయితే చాలా సందర్భాల్లో భారత్‌లో ముఖ్యంగా కలకత్తాలో శాశ్వతంగా ఉండిపోవాలనుకుంటున్నట్లు ఆమె తన కోరికను వ్యక్తం చేశారు. భారత్‌లో శాశ్వత నివాసానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే హోం మంత్రిత్వ శాఖ ఇంతవరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన రచనలకు గాను ఓ వర్గం ముస్లింలు నిరసనలు చేయడం, హింసాత్మక ఘటనలకు దిగడంతో 2007లో ఆమె కలకత్తా విడిచిపెట్టారు. అయితే భారత్‌లో తాను ఉండకపోతే తన ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని, మహిళా హక్కుల కోసం తన రచనల ద్వారా చేస్తున్న పోరాటానికి విఘాతం కలుగుతుందని తస్లీమా చెబుతున్నారు.