ఆధార్‌పై అసత్య కథనాలు ప్రచురించొద్దు: యూఐడీఏఐ హెచ్చరిక

SMTV Desk 2018-01-07 15:43:25  adhar, uidai, media, wrong news, warning

న్యూఢిల్లీ, జనవరి 07: ఆధారాలు లేకుండా ఆధార్ పై వార్తలను ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మీడియాను యూఐడీఏఐ హెచ్చరించింది. ఇటీవల కేవలం రూ.500కే కోట్ల మంది ఆధార్‌ వివరాలు అంటూ ది ట్రిబ్యున్‌ పత్రిక స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఓ కథనం ప్రచురించింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్‌ ద్వారా లీకులు జరుగుతున్నాయని.. లాగిన్‌ వివరాలు ఉంటే ఆధార్‌ డేటా బేస్‌లోకి చొరబడి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా పొందవచ్చని ట్రిబ్యూన్‌ తన కథనంలో తెలిపింది. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కాసేపటికే యూఐడీఏఐ ప్రకటన ఇచ్చింది. ఆ కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ట్రిబ్యూన్‌ రిపోర్టర్‌ రచన ఖైరాపై కేసు కూడా నమోదు అయ్యింది. క్రైమ్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమీషనర్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. రచనతోపాటు ఈ వార్త విస్తృత ప్రచారం కావటానికి కారణమైన అనిల్‌ కుమార్‌, సునీల్‌, రాజ్‌ల పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు ఆయన తెలిపారు. మరో జాతీయ మీడియా ఛానెల్‌పై కూడా ఫిర్యాదు చేసేందుకు యూఐడీఏఐ సిద్ధమౌతోందని సమాచారం. కాగా, ఆధార్‌ కార్డు గోప్యతపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మీడియాకు, ఆ వార్తలను సామాజిక మాధ్యమాలలో వైరల్‌ చేయకూడదని ప్రజలకు యూఐడీఏఐ విజ్ఞప్తి చేసింది.