నెల్లూరు జిల్లాకు సీఎం చంద్రబాబు వరాల జల్లు...

SMTV Desk 2018-01-07 15:13:19  nellore, chandrababu, janmabhoomi, outer ring road

నెల్లూరు, జనవరి 07: నెల్లూరు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించారు. నగరానికి ఔటర్‌ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబునాయుడు వెల్లడించారు. నెల్లూరు మండలంలోని కోడూరుపాడులో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు సభలో సీఎం ప్రసంగించారు. నెల్లూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రతిపాదనను తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా వెంకటగిరి పట్టణానికి ఎక్స్‌ప్రెస్‌ వే వేస్తున్నట్లు పేర్కొన్నారు. కోడూరుపాడు నూతన లేఅవుట్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జాతీయ రహదారి నుంచి కోడూరుపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో దగదర్తి విమానాశ్రయం పనులను 2019 మార్చి కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణపట్నం ప్రాంతంలో సెజ్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, నెల్లూరు నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్టా జిల్లాలో మూడు ఎయిర్‌పోర్టులను తీసుకొస్తామన్నారు. కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు బకింగ్‌హోం కెనాల్‌ను ద్వారా జలరవాణాను అభివృద్ధి చేస్తామన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.149కే ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.