భూమిని పోలిన ఇతర గ్రహాలపై పరిశోధనలు

SMTV Desk 2017-06-20 13:59:46  Universe,Planets,Earth,Kepler Telescope,

కాలిఫోర్నియా, జూన్ 20 : ఈ విశ్వంలో మానవుడు ఏకాకి కాదని రుజువు చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవాన్వేషణ కోసం చాలా కష్టపడుతున్నారు. గ్రహాల అన్వేషణ కోసం నాసా ప్రయోగించిన కెప్లర్‌ టెలిస్కోపు తాజాగా భూమిని పోలిన 10 గ్రహాలను గుర్తించింది. భూమి అంత పరిమాణం ఉన్న ఈ గ్రహాలపై జీవం ఉండే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిపై నీటి జాడలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.మన సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న 219 గ్రహాలపై జరిపిన పరిశోధనలను కెప్లర్‌ మిషన్‌ బృందం విడుదల చేసింది. 2009 నుంచి కెప్లర్‌ టెలిస్కోప్‌ గ్రహాల అన్వేషణ కోసం పరిశోధనలు చేపడుతోంది. కొత్తగా కనుగొన్న 10 గ్రహాలు సూర్యుని వంటి నక్షత్రం చూట్టూ భూగ్రహం మాదిరిగానే పరిభ్రమిస్తున్నాయి. మన భూమికి సూర్యునికి ఉండే మధ్య దూరమే వీటి మధ్య ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగా ఆ గ్రహాలపై వాతావరణ అనుకూల పరిస్థితులు ఉండి ద్రవ స్థితిలో నీరు ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థకు బయట కెప్లర్‌ టెలిస్కోప్‌ ఇప్పటికే 4,034 గ్రహాలను గుర్తించింది. వీటిలో 2,335 గ్రహాలను ఇతర టెలిస్కోపులు గుర్తించి ధ్రువీకరించాయి. ప్రస్తుతం తాజాగా కనుగొన్న భూపరిమాణమంత ఉన్న గ్రహాల సంఖ్యతో జీవం ఉనికికి అవకాశం ఉండే గ్రహాల సంఖ్య 50కి చేరింది. ఈ కొత్త ఆవిష్కరణలను కాలిఫోర్నియాలో జరిగిన నాలుగో కెప్లర్‌, కే2 సైన్స్‌ కాన్ఫరెన్స్‌లో నాసా విడుదల చేసింది.గ్రహాల అన్వేషణ కోసం కెప్లర్‌ టెలిస్కోప్‌ను నాసా 2009లో ప్రయోగించింది. 2013లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే టెలిస్కోపు మాత్రం తన అన్వేషణను ‘కే2’ ప్రాజెక్టు కింద కొనసాగిస్తోంది.