అమెరికా నగరాల్లో అలజడి రేపుతున్న మంచు తుఫాను

SMTV Desk 2018-01-05 13:01:18  Snow Storm america, massive blizzard causes chaos in the Northeast

న్యూయార్క్, జనవరి 5 : ప్రస్తుతం అమెరికా ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాల్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ఈ తుఫాను కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోవడంతో, అమెరికా అట్లాంటిక్‌ తీరాన్ని మంచు తుపాను వణికిస్తోంది. ఈ సమస్యతో దాదాపు 80వేల గృహాలు, వ్యాపార ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అలాగే, మసాచుసెట్స్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాన్ని కూడా మూసేశారు. నార్త్‌ కెరోలినా నుంచి మైనే వరకు తూర్పు తీరం వెంట ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 70మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని వల్ల విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. న్యూజెర్సీలో మంచు కప్పేయడంతో, విపరీతమైన చలి, మంచు కారణంగా గత కొద్దిరోజులుగా 14 మంది మరణించారు. నార్త్‌కెరోలినాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు, టెక్సాస్‌లో చలి కారణంగా ముగ్గురు మరణించారు. దాదాపు 5వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. కాగా, ఇంధనం సరఫరా చేసే పైపులలో కూడా ఈ మంచు గడ్డకట్టుకుపోవడంతో తీవ్ర ఇంధన కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా ప్రజల్లో అలజడి పుట్టిస్తున్న ఈ మంచు తుఫానును "బాంబ్‌ సైక్లోన్‌" గా పేర్కొంటున్నారు.