డిజిటల్ ఇంటి నెంబర్లకు మార్గం సుగమం..

SMTV Desk 2018-01-05 11:52:36  Digital house address, ts government, new policy.

హైదరాబాద్, జనవరి 4 : అభివృద్ధి పథంలో దూసుకుపోతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసింది. ప్రస్తుతం నగరాల్లో ఇంటి చిరునామాను కనిపెట్టడం కాస్త కష్టతరమవుతున్న నేపథ్యంలో చిరునామా కష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు వినూత్న రీతిలో "డిజిటల్‌ ఇంటి నంబర్ల" విధానానికి తెలంగాణ పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం ఇంటింటికి డిజిటల్‌ నంబర్లను కేటాయించనుంది. ఈ పద్దతిలో మొదటగా ప్రాంతం పేరు, రోడ్డు నంబరు, అంతస్తుల వారీగా వేర్వేరు కోడ్‌లను కేటాయించనున్నారు. ఆయా అంతస్తుల్లోని వేర్వేరు ఇళ్లకు వేర్వేరు నంబర్లు ఇస్తారు. ప్రతి రోడ్డుకు ఒక ప్రత్యేక గుర్తింపు నెంబరు, ప్రతి ఇంటికి ప్రత్యేక డోర్‌ నెంబరు ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంటి నెంబరు ఎస్‌ఆర్‌ఎన్‌ బి02 డి01ఉంది అనుకోండి. ఇందులో మొదట ఉన్న ఎస్‌ఆర్‌ఎన్‌ అనే మూడక్షరాలు శ్రీరాంనగర్‌ను, బి02 అనేది రోడ్డు లేదా వీధిని సూచిస్తుంది. డి01 అనేది గ్రౌండ్‌ ఫ్లోర్‌ను సూచిస్తుంది. ఇదే ఇంటిలో ఒకవేళ మొదటి అంతస్తు ఉంటే దానికి డి11 అని, రెండో అంతస్తు ఉంటే డి21.. ఇలా మారుతూ ఉంటుంది. ఒకవేళ మొదటి అంతస్తులో నాలుగు ఫ్లాట్లు ఉంటే కనుక డి11, డి12, డి13 డి14గా అంకెలను కేటాయించనున్నారు. డిజిటల్‌ ఇంటి నంబర్ల విధానాన్ని గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానించనున్నారు.