ధోని అగ్రశ్రేణి కాంట్రాక్ట్ పై వేటు పడనుందా..!

SMTV Desk 2018-01-04 17:27:15  dhoni, a grade contract, bcci, coa, bcc finance

న్యూఢిల్లీ, జనవరి 4 : టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ ‘ఎ’ గ్రేడ్‌ పై వేటు పడనుందా..? అవుననే అంటున్నాయి బీసీసీఐ అధికార వర్గాలు..! ఇప్పటికే అంతర్జాతీయ టెస్టుకు వీడ్కోలు పలికిన మహేంద్రుడిను బీసీసీఐ అగ్రశ్రేణి కాంట్రాక్టులో ఉంచడంపై ఇప్పటికే పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అడ్మినిస్ట్రేషన్‌ కమిటీ(సీవోఏ) తాజా కాంట్రాక్టులో అతడి పేరును అగ్రశ్రేణి నుండి తప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై చర్యలు చేపట్టిన సీవోఏ కొన్ని మార్పులు చేసి తుది నివేదికను తయారు చేసింది. దీన్ని త్వరలో బీసీసీ ఫైనాన్స్‌ కమిటీకి అందజేయనుంది. ఏ ప్లస్‌, ఏ, బీ, సీ ఇలా నాలుగు శ్రేణుల ద్వారా ఆటగాళ్లకు జీతాలు అందజేయాలనుకుంటుంది. ఈ జాబితాలో ధోని తన అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, వన్డే, టీ20 ఈ మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లను మాత్రమే ఏ ప్లస్‌ శ్రేణిలో చేర్చినట్లు సమాచారం. అలాగైతే ధోని అగ్రశ్రేణి కాంట్రాక్టును కోల్పోవడం తప్పదు.