నేడు సబ్సిడీ గొర్రెల పంపీణీ పథకం

SMTV Desk 2017-06-20 12:21:52  Sheep distribution scheme, CM K. Chandrasekhar Rao, GAJWEL,Tharassani Srinivas Yadav, State Minister of State for Animal Husbandry

హైదరాబాద్, జూన్ 20 : తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కుర్మలను లక్షాధికారులగా చేసే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకానికి మంగళవారం రోజున సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోని కొండపాక గ్రామంలో శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 62 వేల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. 45 లక్షల ఎకరాల అటవీశాఖ భూములు, పండ్ల తోట ల్లో గొర్రెలకు గడ్డి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ సందర్భంగా గొర్రెల అభివృద్ధి పథకం పోస్టర్‌ను తలసాని ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా, డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్‌ ఎండీ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోని 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 గొర్రెల పెంపకందారుల సొసైటీలు నమోదయ్యాయి. వీటిల్లో 7,18,069 మంది సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి విడత లబ్ధిదారులందరికీ గొర్రెలను అందజేస్తారు. ఎవరికి, ఎప్పుడు గొర్రెలను పంపిణీ చేయాలన్న దానిపై లాటరీ పద్ధతిలోనే నిర్ణయం తీసుకున్నారు. 21+1 గొర్రెల యూనిట్‌కు రూ. 1.25 లక్షలు ఖర్చు కానుంది. అందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా మిగిలిన సొమ్మును లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. గొర్రెల కొనుగోలు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు, కర్ణాటకలో 21, తమిళనాడులో 5, మహారాష్ట్రలో 23 జిల్లాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తారు. వచ్చే ఆరు నెలలపాటు ఆయా రాష్ట్రాల్లో జిల్లా సెంట్రల్‌ టీంలు నిత్యం అక్కడే ఉండి గొర్రెల సేకరణ చేపట్టనున్నారు. రెండేళ్లలో సరఫరా చేసే మొత్తం కోటిన్నర గొర్రెల కోసం రూ. 10 వేల కోట్లు ఖర్చు కానుందని అందులో ప్రభుత్వం రూ. 7,500 కోట్లు సబ్సిడీ రూపంలో భరించనుండగా, లబ్ధిదారులు రూ. 2,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. సేంద్రియ ఎరువు పుష్కలం ఈ ఏడాది 75.17 లక్షలు, వచ్చే ఏడాది మళ్లీ ఇన్ని ఇస్తున్నందున మొత్తం కోటిన్నర గొర్రెలతో పంటల సాగుకు అవసరమైన సేంద్రియ ఎరువు పుష్కలంగా లభిస్తుందని వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. పండ్ల తోటల్లో ఖాళీగా ఉన్నచోట గొర్రెలు మేపుకోవడానికి పశుగ్రాసం పెంచడానికి రైతులకు 75 శాతం రాయితీపై విత్తనాలిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా ఈ తోటలకు అవసరమైన ఎరువును రైతులకు ఉచితంగా ఇవ్వాలని గొర్రెల పెంపకందారులకు పశుసంవర్థక శాఖ తెలిపారు. దశాబ్దాలుగా విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకం పెరగడంతో భూములు నిస్సారమవుతున్నయన్నారు. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు సహా ప్రజాప్రతినిధులంతా భాగస్వాము లు కావాలని కోరారు.