మరో ఆరు నెలల్లో ఏటీఎంల ద్వారా రూ. 200 నోట్లు..!

SMTV Desk 2018-01-04 14:25:21  200 rupees notes, atm, rbi, demonitisation

ముంబై, జనవరి 4 : కేంద్ర ప్రభుత్వం డిమోనిటైజేసన్ తర్వాత భారత్ విపణిలోకి రూ.2000 నోట్లను విడుదల చేసింది. అయితే ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు చిల్లర కోసం పడిన భాదలు వర్ణనాతీతం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు నుంచి రూ. 200 నోటును ప్రవేశపెట్టింది. కానీ ప్రస్తుతం అవి అంతగా వినియోగంలోకి రాలేదు. దీంతో ప్రజలకు చిల్లర సమస్య తీర్చేందుకు ఈ నోట్లను వీలైనంత త్వరగా ఏటీఎంల ద్వారా అందజేయాలని బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) ఆదేశించింది. ఈ విషయం పై ఓ అధికారి మాట్లాడుతూ..."రూ. 200 నోట్లను వీలైనంత త్వరగా ఏటీఎం ద్వారా అందించాలని బ్యాంకులను, ఏటీఎం తయారీదారులను ఆర్‌బీఐ ఆదేశించింది" అని వెల్లడించారు. అయితే దీనిపై ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఇప్పుడున్న ఏటీఎంల ద్వారా రూ.200 నోట్లను అందించాలంటే అందుకోసం వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పుల కోసం ఒక్కో ఏటీఎంపై సగటున రూ.5000 ఖర్చు చేయాల్సి ఉంటుందని, దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఏటీఎంలు ఉండగా, వీటన్నింటిని మార్చాలంటే రూ.110కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటికే మార్పు ప్రక్రియ ప్రారంభించిన సంబంధిత శాఖలు జులై నాటికి ఏటీఎంలలో రూ. 200నోట్లు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.