పులివెందులలో తెదేపాను గెలిపించకపోయినా అభివృద్ది ఉంటుంది : చంద్రబాబు

SMTV Desk 2018-01-03 15:34:47  ap cm chandrababu naidu, kadapa janmabhumi-maa uru meeting

కడప, జనవరి 03 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కడపలో నిర్వహించిన జన్మభూమి-నా ఊరు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాయలసీమ ప్రాంతంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పట్టిసీమ నుంచి నీరు తీసుకొచ్చాం. సీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పులివెందులలో తెదేపాను గెలిపించకపోయినా అభివృద్దికి నిధులు ఇస్తూనే ఉంటుందన్నారు. ఇక్కడ ముఠా కక్షల వల్ల కంపెనీలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రజలెవరైనా 1100 నంబరుకు ఫోన్‌ చేస్తే వారి సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం సాధించే విధంగా శ్రద్ధ పెట్టమని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి అందరు తమకు సహకరించండని వెల్లడించారు. కాగా, గండికోట చిత్రావతి ఎత్తిపోతలను జాతికి అంకితం చేశారు. ఎత్తిపోతల జలాలకు పూజలు చేసి ముఖ్యమంత్రి హారతిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని, సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.