మోత మోగించిన మున్రో..

SMTV Desk 2018-01-03 15:12:50  colin munro, newzealand, t-20, west indies,

మౌంట్ మాంగనీ, జనవరి 3 : న్యూజిల్యాండ్ ఆటగాడు కోలిన్ మున్రో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మౌంట్ మాంగనీ వేదికగా వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మూడో టీ-20 లో (47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్ల) సెంచరీతో బేఓవల్ మైదానంను మోత మోగించాడు. ఈ మెరుపు శతకంతో అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులోకెక్కాడు. మున్రో వీర విహారం చేయడంతో కివీస్ జట్టు నిర్ణిత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. సునామీ బ్యాటింగ్ తో రెచ్చిపోయిన మున్రో 104 పరుగుల వద్ద చివరి ఓవర్ తొలి బంతికి ఔట్ గా వెనుదిరిగాడు. న్యూజిల్యాండ్ జట్టుకు టీ-20ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ బాదాడు. ఈ ఏడాది నవంబర్‌ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో టీ-20 మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. భారీ లక్ష్యంను చేధించేందుకు బరిలోకి దిగిన కరేబియన్ జట్టుకు మొదటిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు వాల్టన్, గేల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరారు. తర్వాత ఏ దశలోనూ పోరాట పటిమను చూపలేని విండీస్ జట్టు 124 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో టిం సౌథీ మూడు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, ఇషి సోది చేరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ అఫ్ ది సిరీస్’ గా కోలిన్ మున్రో ఎంపికయ్యారు.