రిజిస్ట్రేషన్ల శాఖలో మరో అవినీతి తిమింగలం

SMTV Desk 2017-06-19 18:32:24  Vishakapatnam,Gajuvaka,Sub Registrar,Land

విశాఖపట్నం, జూన్ 19 : విశాఖపట్టణంలోని గాజువాక సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడు నివాసంలో అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. ఈ రోజు ఉదయం నుంచి విశాఖలోని ఆయన నివాసం ‘శ్రీ గోవిందం భవనం’తో పాటు, తిరుపతిలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.6 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. విశాఖలో 15 ఇళ్ల స్థలాలు, నర్వలో 4 ఎకరాల భూమి ఉన్నట్టు ఆధారాలు సేకరించారు. వెంకయ్యనాయుడు నివాసంలో రెండు కార్లు, బైక్ ను సీజ్ చేశారు. 1.75 కిలోల బంగారం,1.35 కిలోల వెండి, రూ.20 లక్షల విలువైన వస్తువులు, రూ.42 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్,రూ. 5 లక్షల పత్రాల ఉన్నట్టు గుర్తించారు. విశాఖ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఆయన పేరిట లాకర్ ఉన్నట్టు, వెంకయ్యనాయుడు తన మామ పేరుతో తిరుపతిలో ఐదు అంతస్తుల లాడ్జి, తోడల్లుడు పేరుతో తుంగ్లాంలో ఓ భవనం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. విశాఖలో 6 , తిరుపతిలో 3 చోట్ల అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బృందాలు సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, 2011 జనవరిలో ఏసీబీ సోదాల్లో వెంకయ్యనాయుడు అరెస్టయ్యాడు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ గా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో ఏసీబీ తనిఖీల నిర్వహించి అక్రమాస్తుల కేసులో ఆయన్ని అరెస్టు చేసింది.