గాంధీ- మండేలా ప్రోమో విడుదల...

SMTV Desk 2018-01-02 18:59:04  india, south africa, gandhi-nelson mandela, promo, cricket

కేప్‌టౌన్‌, డిసెంబర్ : భారత్- సౌతాఫ్రికా ఈ రెండు దేశాలు స్వాతంత్ర్య౦ కోసం అలుపెరగని పోరాటం చేసి తెల్లదొరల పాలన నుండి విముక్తి పొందినవే .అంతే కాకుండా భారత్ లోని బ్రిటిష్ వారి నియంతృత్వ ధోరణికి బీజం పడింది కూడా ఈ దేశంలోనే. మన జాతిపిత గాంధీ మహాత్ముడు న్యాయవాదిగా తొలుత ఇక్కడే కేసులు వాదించారు. రైలు ప్రయాణంలో ఫస్ట్‌క్లాస్‌ టికెట్‌ ఉన్నా తెల్ల దొరలు అహంకారంతో ఆయన్ను రైలు నుంచి బయటకు తోసివేయడంతో అవమానం ఎదుర్కొన్నారు. దాంతో బ్రిటిష్‌ వారిపై పోరాడాలని భారత్‌కు వచ్చి అహింసాయుతంగా పోరాటం మొదలుపెట్టారు. ఇటు దక్షిణాఫ్రికాలో గాంధీజీని ఆదర్శంగా తీసుకుని నెల్సన్‌ మండేలా అహింసాయుత పోరాటంతో జాతివివక్షను అంతమొందించారు. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్‌ కోసం కోహ్లీసేన దక్షిణాఫ్రికా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 5న మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం ఒక వీడియో ప్రోమోను విడుదల చేసింది. అందులో భారత-దక్షిణాఫ్రికా స్నేహంకు చిహ్నంగా గాంధీ మహాత్ముడు, నెల్సన్‌ మండేలా అవిరామ పోరాటాలను ఉంచింది. రెండు జట్ల మధ్య 1992లో జరిగిన తొలి సిరీస్‌ జ్ఞాపకాలను చేర్చింది. ఇప్పుడు ఆ ప్రోమో అందరిని అలరిస్తుంది. మునుపు ఈ రెండు దేశాల మధ్య జరిగిన సిరీస్‌లను ‘ఫ్రెండ్‌షిప్‌ సిరీస్‌’లుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ‘ఫ్రీడమ్‌ సిరీస్‌’గా మార్చేశారు. 1992లో అజారుద్దీన్‌ నాయకత్వంలో భారత్ భారత్ జట్టు సఫారీ గడ్డపై కాలు మోపింది. సౌతాఫ్రికా జట్టుకు క్లైవ్‌ రైస్‌ సారథిగా వ్యవహరించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-0 తేడాతో గెలిచింది. ఏడు వన్డేల సిరీస్‌ను 5-2తో కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు అక్కడ సిరీస్‌ గెలవని టీమిండియా ఈ సారి ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తుంది.