సబ్సీడీలతో అభివృద్ధి జరగదు -తెలంగాణ సీఎం కేసిఆర్

SMTV Desk 2017-06-19 18:00:24  Telangana Government,CM KCR,Ramzan,Muslim

హైదరాబాద్, జూన్ 19 : రంజాన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీలతో ముస్లింల అభివృద్ధి జరగదని, ప్రతి రంగంలో జనాభా ప్రకారం వారి వాటా వారికి దక్కేందుకు ప్రభుత్వం పలు చర్యలను ప్రారంభించిందని తెలిపారు.. దీనిలో భాగంగా వివిధ రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దీన్ని సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన ముస్లింల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. ఆ వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లను ఏర్పాటు చేసి ప్రైవేటు తరహాలో విద్యనూ అందిస్తున్నామని కేసిఆర్ వివరించారు. విశ్రాంత డీజీ ఏకే ఖాన్ అధ్యక్షతన ఈ మైనారిటీ గురుకుల కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ లతో సమానంగా ఉపకార వేతనాలు, రిజర్వేషన్ లను ముస్లిం విద్యార్థులకు కూడా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విదేశాల్లో ఉన్నత చదువులకై వెళ్లేందుకు రూ. 20 లక్షల స్కాలర్ షిప్ అందజేస్తున్నామని, ఇప్పటి వరకు 595 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు. 100 మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఐఎఎస్, ఐపీఎస్ శిక్షణ ఇసున్నామని , ఇందుకోసం హైదరాబాద్ లోని మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశామని అన్నారు. నాంపల్లిలోని అనీస్ ఉల్ గుర్భా ముస్లిం అనాధాశ్రమ భవనానికి ఆదివారం రోజున శంకుస్థాపన చేశానని,హైదరాబాద్ లోఅంతర్జాతీయ ఇస్లామిక్ సెంటర్ ను కూడా త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రముఖులు, విద్యావేత్తలు , మేధావులను సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ శాసనసభ సభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి , జూపల్లి కృష్ణారావు , ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు.