ప్రజా సహకారం లేకపోతే పోలీసు ఉద్యోగం చేయలేం : డీజీపీ కొండయ్య

SMTV Desk 2018-01-01 16:07:46  ap dgp m. malakondaiah, oath, dgp sambashivarao

అమరావతి, జనవరి 1 : "ప్రజా సహకారం లేకపోతే పోలీసు ఉద్యోగం చేయలేం" అంటూ రాష్ట్ర నూతన డీజీపీ డా.ఎం.మాలకొండయ్య అన్నారు. ఆయన మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు నూతన డీజీపీ డా.ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ.. "పోలీసుశాఖలో సంక్షేమం, శిక్షణకు పెద్దపీట వేస్తా౦. అలాగే నేర నియంత్రణ కచ్చితంగా జరిగేలా చూస్తా౦. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడతాయి. సిబ్బందిలో సామర్థ్యాల పెంపునకు ప్రయత్నిస్తాం. ఇవ్వన్ని జరగడానికి ప్రజా సహకారం లేకపోతే అసలు పోలీసు ఉద్యోగం చేయలేం. పోలీసు శిక్షణలో లోపాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం. సైబర్‌ నేరాలను విశ్లేషించి.. కార్యాచరణ రూపొందిస్తాం. డీజీపీగా సాంబశివరావు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం" అని వ్యాఖ్యానించారు. అనంతరం పదవీ విరమణ చేసిన డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ.. "33 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎంతో మంది పోలీసు అధికారులు, 600 మందికి పైగా కానిస్టేబుళ్ల ప్రాణత్యాగాల వల్లే ఈ రోజు రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీసు బ్రాండ్‌ ఇమేజ్‌ను మరింత పెంచాలన్న ఉద్దేశంతోనే అనేక ఆవిష్కరణలు తీసుకొచ్చా. పోలీసుశాఖకు మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేశానన్న సంతృప్తి ఉంది" అంటూ తెలిపారు.