గుజరాత్ లో ముగిసిన అసమ్మతి రాగం

SMTV Desk 2017-12-31 16:03:11  nithin patel, amith shah, gujarath, bjp

గుజరాత్, డిసెంబర్ 31 : గుజరాత్ లో వరుసగా ఆరోసారి అధికార పీఠం దక్కించుకున్న బీజెపీ పార్టీలో అంతర్గత లుకలుకలు ప్రారంభమయ్యాయి. తనకు కేటాయించిన పదవి పై ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే దీనిపై స్పందించిన అధిష్టానం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ను రంగంలోకి దింపింది. చర్చల జరిపిన అమిత్ షా చివరకు అతనికి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు నితిన్‌ పటేల్‌ వెల్లడించారు. దీంతో ఈ రోజు కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ‘‘పార్టీ చీఫ్‌ అమిత్‌ షా.. ఫోన్‌ చేసి నాతో మాట్లాడారు. నాకు తగిన శాఖలనే కేటాయించే విషయంలో హామీ ఇచ్చారు. ఆయనకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఆ హామీ మేరకు ఇప్పుడే సెక్రటేరియట్‌కు వెళ్లి బాధ్యతలు తీసుకుంటా’’ అని నితిన్‌ పటేల్‌ మీడియాతో అన్నారు. గత బీజెపీ హయంలో ఆర్థిక, పెట్రోలియం, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన నితిన్‌ పటేల్‌ సీఎం తర్వాత నంబర్‌2గా పేరుపొందారు. తాజా ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్టానం ఆయనను మరోసారి డిప్యూటీ సీఎంను చేస్తూనే రహదారులు-భవనాలు, ఆరోగ్యం, వైద్య విద్య వంటి శాఖల్ని కేటాయించింది. దీంతో తనకు సరిపడని శాఖలు కేటాయించారని నితిన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమయంలో పాటీదార్‌ ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ బీజేపీపై విమర్శలు సంధించడమే కాకుండా తగిన గుర్తింపు కోసం బీజేపీని వీడి రావాలని నితిన్‌ పటేల్‌ను కోరారు. ‘‘పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నితిన్‌ పటేల్‌ చెబితే, మరో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. వారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి మేం సంసిద్ధంగా ఉన్నాం’’ అని హార్దిక్‌ మీడియాతో అన్నారు. చివరికి అమిత్‌ షా జోక్యం చేసుకుని మంతానాలు జరపడంతో అసమ్మతి రాగం చల్లబడి నితిన్‌ ఇచ్చిన శాఖలనే తీసుకునేందుకు అంగీకరించారు.