ఉద్యోగ నియామకాల్లో నూతన విధానం

SMTV Desk 2017-06-19 13:27:45  Telangana Government,Jobs Recruitment,Police Department,TS chief secretery SP Singh

హైదరాబాద్, జూన్ 19 : గతంలో కొద్ది రోజుల వరకు ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను గురించి చర్చలు జరిపిన ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగ నియామకాల్లో నూతన విధానాన్ని అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఖాళీల భర్తీకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. ఇకపై భవిష్యత్తులో అవసరమయ్యే కొత్త పోస్టులూ కలిపి నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విధానంతో అన్ని శాఖల్లో భారీ ఎత్తున కొలువుల లెక్క తేలుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు చకచకా నియామకాల ప్రక్రియ సాగేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం నియామకాల విధానాన్ని సమీక్షించింది. ఖాళీలతో పాటు కొత్త నియామకాలను ఒకే దఫా చేపట్టాలని నిర్ణయించింది. పోలీసు శాఖతో దీన్ని ప్రారంభిస్తోంది. ఈ శాఖలో గుర్తించిన ఖాళీలు 8 వేలు మాత్రమే. కానీ, పోలీసు శాఖలో వచ్చే మూడేళ్ల అవసరాలకు ప్రభుత్వం అంచనా వేసిన పోస్టుల మొత్తం 18290గా లెక్క తేలింది. వీటన్నింటినీ భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించి శనివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేసింది. ఇదే తరహాలో అన్ని శాఖల్లోనూ నియామకాలు జరగాలని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా సూచించినట్లు తెలిసింది. ఖాళీలు, కొత్త పోస్టుల నియామకాలు ఒకే దఫా చేపట్టాలనే విధానం అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్.పి.సింగ్ఆయా శాఖల్లో ప్రస్తుత ఖాళీలతోపాటు సమీప భవిష్యత్తులో అవసరమైన పోస్టుల వివరాలను తీసుకుంటారు.