మోత మోగనున్న ప్రైవేటు పాఠశాలల ఫీజులు..!

SMTV Desk 2017-12-30 17:46:45  school fees increase, telangana govt, private schools.

హైదరాబాద్, డిసెంబర్ 30 : ఇకపై ప్రైవేటు పాఠశాలల ఫీజుల మోత మోగనుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పేరెంట్స్‌ అసోసియేషన్‌తో భేటీ అయిన ఈ కమిటీ ప్రతిపాదనలను వివరించింది. ఇకపై అన్ని స్కూళ్లు ఎవరి అనుమతి లేకుండానే 10 % వరకు ఫీజులను పెంచుకోవచ్చని సిఫారసు జారీ చేసింది. ఒకవేళ అంతకు మించి పెంచుకోవాలనుకుంటే మాత్రం కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా ప్రొ.తిరుపతిరావు కమిటీ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు పెంచుకోవాలన్న ఆలోచనలేని పాఠశాలలకు కూడా పెంచుకునే అవకాశం కల్పించారని పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపాదనలను ఆమోదించే ప్రసక్తి లేదని, ఆమోదిస్తే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కమిటీ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. * ప్రైవేట్‌ పాఠశాలలు ఎవరి అనుమతి తీసుకోకుండానే ప్రతి ఏడాది 10% వరకు ఫీజులు పెంచుకోవచ్చు. ఒకవేళ అందులో కనుక లాభం తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. * 10% వరకు ఫీజులు పెంచుకుంటే రికార్డులు తనిఖీ చేయాల్సిన అవసరం లేదు. * ఫీజుల పెంపునకు సంబంధించి కొన్ని జిల్లాలను కలిపి జోనల్‌ ఫీజుల నిర్ధారణ కమిటీని(జెడ్‌ఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలి. * 10%కు పైగా ఫీజులు పెంచుకోవాలనుకునే పాఠశాలలు జెడ్‌ఎఫ్ఆర్సీకి ఆదాయ, వ్యయ వివరాలను అందజేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. * ప్రతి ఏటా అన్ని పాఠశాలలు వారి ఆదాయ, వ్యయ వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి.