అన్యమత ఉద్యోగులకు నోటీసులు ఇవనున్న టీటీడీ..!

SMTV Desk 2017-12-30 16:14:07  ttd, non hindu religious, employees, tirupathi

తిరుపతి, డిసెంబర్ 30 : తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ)లో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 44 మంది అన్యమతస్థులకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లడంతో అన్యమతస్థుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై విద్యాసంస్థలు మినహా మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్నవారి వివరాలపై విజిలెన్స్‌ విభాగం ఆరా తీసింది. సంస్థ పరిధిలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులు 44మంది ఉన్నట్లు విజిలెన్స్‌ తెలిపింది. 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. 2007 లో అప్పటి టీటీడీ పాలకమండలి అన్యమతస్థుల ఉద్యోగాలపై తీర్మానం చేసింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఏడుగురు ఇతర మతస్థులు విధుల్లో చేరారు. కాగా, ఆలయాలు, ఇతర ముఖ్య విభాగాలకు అన్యమతస్థులను దూరంగా ఉంచాలని పీఠాధిపతులు డిమాండ్‌ చేస్తున్నారు. సంస్థలో ఉద్యోగులుగా అన్యమతస్తులను కొనసాగించాలా, లేదా అనే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.