‘స్మిత్’ రికార్డుల హవా...డ్రాగా ముగిసిన యాషెస్ టెస్ట్

SMTV Desk 2017-12-30 13:47:03  smith, ashes test, draw, record, australia, england

మెల్‌బోర్న్‌, డిసెంబర్ 30 : యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. 103/2 ఓవర్ నైట్ స్కోర్ తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ఆట మొదలు పెట్టిన ఆసీస్ జట్టులో వార్నర్ (86), కెప్టెన్ స్మిత్(102) మరో సారి శతకంతో అలరించాడు. దీంతో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు 3-0 యాషెస్ ను వశం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చివరి టెస్ట్ జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనుంది. మరోవైపు స్మిత్ తన రికార్డుల హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఈ శతకంతో ఆసీస్ సారధి తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 23వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా స్మిత్ కు ఇది 15 వ శతకం కావడం విశేషం. అంతే కాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించిన మూడో ఆటగాడిగా స్మిత్‌ నిలిచాడు. బ్రాడ్‌మన్‌(58 ఇన్నింగ్స్‌లు), సునీల్‌ గవాస్కర్‌(109 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా, స్మిత్‌ 110 ఇన్నింగ్స్‌ల్లో 23వ సెంచరీని సాధించాడు. కాగా, ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ (1305) అగ్రస్థానంలో నిలవగా, టీమిండియా నయావాల్ చతేశ్వర పుజరా (1128) పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన నాలుగు టెస్టుల్లో స్మిత్‌ మూడు సెంచరీలు సాధించాడు.