తప్పుల తడికగా విద్యార్థుల మార్కులు

SMTV Desk 2017-06-18 19:20:09  CBSE Class 12, delhi, Mathematics, Student

న్యూ ఢిల్లీ, జూన్ 18 : ఢిల్లీకి చెందిన సోనాలి.. ఇటీవల విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు. అన్ని సబ్జెక్టుల్లోను 90కి పైగా మార్కులు సంపాదించింది కానీ ఒక్క గణితశాస్త్రంలో మాత్రం ఆ విద్యార్థికి 68 మార్కులు మాత్రమే వచ్చాయి. మరో కళాశాలకు చెందిన సమీక్షా శర్మ అనే విద్యార్థినికి కూడా గణితశాస్త్రంలో 42 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో మాత్రం మంచి మార్కులు వచ్చాయి. దాంతో ఈ ఇద్దరు విద్యార్థినులు తమ సమాధాన పత్రాలను మరోసారి పరిశీలించాల్సిందిగా సీబీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకున్నారు. మరోసారి వాళ్ల సమాధాన పత్రాలు పరిశీలించగా.. సోనాలికి గణితంలో 95 మార్కులు వచ్చాయి.. కానీ 68 వేసినట్లు గ్రహించారు. సమీక్షా శర్మకు 90 మార్కులు వస్తే.. 42 వేశారు. సోనాలి, సమీక్షాశర్మలకే కాదు.. ఎంతోమంది విద్యార్థుల మార్కుల్లో ఇలాగే తప్పులు దోర్లుతుండటంతో ఓ ఆంగ్ల వార్తా సంస్థ ద్వారా సీబీఎస్‌ఈ మార్కుల తప్పులు బయటికి వచ్చాయి. మరో విద్యార్థికి ఎకనామిక్స్‌లో 9 మార్కులు వచ్చి ఫెయిల్‌ అయ్యారు. అతడి సమాధాన పత్రాలను పరిశీలించగా 45 మార్కులు వచ్చాయి. దానికి సంబంధించి సీబీఎస్‌ఈ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి ప్రస్తుతానికి ఎటువంటి స్పందనా రాలేదు. దీనిపై సీబీఎస్‌ఈ ఎగ్జామ్‌ బ్రాంచ్‌ సీనియర్‌ అధికారి మాట్లాడాతూ, మార్కుల పూర్తి లెక్కింపులో తప్పు జరిగి ఉండవచ్చు, లేదా సమాధాన పత్రం టైటిల్‌ పేజీలో వేసిన మార్కులు సక్రమంగా ఉండకపోవచ్చు. వీటివల్ల విద్యార్థులకు వచ్చిన ఫలితాల్లో తప్పులు జరిగి ఉంటాయని ఆయన భావిస్తున్నారు. ఇలా సరిగా చూసుకోకుండా మార్కులు వేయడం వల్ల విద్యార్థుల జీవితాలు ప్రమాదాల్లో పడటంతో పాటు వారికి ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.