నూతన సంవత్సర వేడుకలకు జీఎస్టీ సెగ..!

SMTV Desk 2017-12-29 11:33:42  new year celebrations, gst tax, 28 percent tax.

హైదరాబాద్, డిసెంబర్ 29 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 31వ తేదీన అర్ధరాత్రి వరకు పలు ఈవెంట్లను నిర్వహించే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఎన్నో వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వేడుకలకు జీఎస్టీ కళ్లెం వేయనుంది. ఆ రోజు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి 28% జీఎస్టీ చెల్లించాల్సిందేనని రాష్ట్ర పన్నుల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కార్యక్రమాలను నిర్వహించాలనుకునే వారు మొదట ఎస్‌జీఎస్టీ/సీజీఎస్టీ చట్టాల్లోని సెక్షన్‌ 25(1) కింద సాధారణ ట్యాక్స్‌ పర్సన్‌గా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈవిధంగా రిజిస్టర్‌ అయిన వారు నిర్వహించే ఈవెంట్ల అంచనా టర్నోవర్‌పై 28% మేర జీఎస్టీని విధించనున్నట్లు రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటికే పలు క్లబ్‌లు, హోటళ్ల యాజమాన్యాలు, వాహనదారులకు నగర పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు తగు సూచనలు చేశారు. ఒకవేళ జీఎస్టీ చెల్లించలేదంటే 100% అపరాధ రుసుము వసూలు చేస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. అలాగే 31 న రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు అన్ని ఫ్లై ఓవర్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డులపై రాకపోకలు నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసు నమోదు చేయడమే కాక వారి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.