మట్టి పాత్రలకు మళ్లీ ఆదరణ...

SMTV Desk 2017-12-28 17:46:26  claypots cooking

హైదరాబాద్, డిసెంబర్ 28 : కొత్తొక వింత, పాతోక రోత అంటారు పెద్దలు. ఆధునిక పద్ధతులతో వస్తున్న ప్రమాదాలతో పాతే ముద్దు అనే పరిస్థితి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధతో మట్టి పాత్రలపై మోజు పెరుగుతుంది. తాజా మార్పులతో కుమ్మర్లు అన్నం, కూరలు వండేందుకు వీలుగా మట్టి పాత్రలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారుల నుంచి వీటికి విశేషస్పందన లభిస్తుంది. స్టీలు, అల్యూమినియం పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, గ్లాసులు ఏ వంటింట్లో చూసిన ఇదే. ఆధునిక పద్ధతులతో పాటే, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఉదయం వండిన అన్నం సాయంత్రానికే పాడైపోతుంది. అదే మట్టి పాత్రాల్లో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం అన్ని రకాల సౌలభ్యం అందుకే మట్టి పాత్రలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. అయితే, వైద్యుల సూచనలతో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే భావనతో మరికొందరు దీనికి ఆకర్షితులవుతున్నారు. కొన్ని హోటళ్లకే పరిమితమైన మట్టి పాత్రల వంట ఇప్పుడు ఇళ్లలోనూ పెరుగుతుంది. గిరాకీకి అనుగుణంగా కుమ్మరులు కూడా మట్టి వంట పాత్రల్ని తయారు చేస్తున్నారు. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కుమ్మరి కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఒక్క తంగడిపల్లిలోనే 10 కుటుంబాలు మట్టి పాత్ర తయారు చేస్తున్నారు. ఇంట్లో ఎందరు ఉంటే అందరు ఈ పనినే చేస్తూ, కాలం గడుపుతున్నారు. గతంలో మాదిరిగా కేవలం కుండలకే పరిమితం కాకుండా ఆధునికతకు అనుగుణంగా సరికొత్త రీతిలో మట్టి పాత్రలను రూపొందిస్తున్నారు.