ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రాథమిక ఉల్లంఘన : ఒవైసీ

SMTV Desk 2017-12-28 14:30:26  Triple talaq, new rules issued by central government, mp asaduddin ovaisi comments.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల "ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు" ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ విషయంపై పార్లమెంట్ లో చర్చల సందర్భంగా హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, చట్టపరంగా పొందిక లేదని తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా ఒవైసీకి బీజేడీ ఎంపీ బర్తృహరి మహతబ్‌ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు దోషపూరితంగా ఉందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. వారికి సమాధానంగా.. "ఇది ముస్లిం మహిళల హక్కులను పరిరక్షిస్తుందే తప్ప ఏ మతానికి, ఆచారానికి వర్తించదు" అని తెలిపారు. నేరుగా రాత రూపంలో, లేదా ఎలక్ట్రానిక్‌ విధానంలో ముమ్మారు తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. అలా చెప్పిన భర్తలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు, జరిమానా విధించనున్నారు. ఈ మేరకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, జీవన భృతి కోరడానికి వీలు కల్పించింది.