పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్...

SMTV Desk 2017-12-26 11:16:24  BHAVANI DWEEPAM, CHANDRABABU NAIDU, AKHILA PRIYA, VIJAYAWADA

విజయవాడ, డిసెంబర్ 26: పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పర్యాటక ప్రాజెక్టులకు సాంకేతిక జోడింపు అందించి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలన్నారు. విజయవాడ భవానీద్వీపంలో ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే మ్యూజికల్‌ ఫౌంటేన్‌, లేజర్‌షోను సోమవారం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అబ్బురపరిచే లేజర్ కిరణాలు, సంగీతానికి అనుగుణంగా నాట్యమాడే నీటి ఫౌంటేన్‌లు, తెలుగు సంస్కృతి సంప్రదాయం ఉట్టి పడేలా కృష్ణ నదిపై కూచిపూడి నృత్యాలు, దుర్గామాత విశ్వరూపం, నగర వాసులను మైమరిపించాయి. నది ఉపరితలంపై ఏర్పాటు ఈ విద్యుత్ దీపాల వెలుగులను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... నవ్యాంధ్రప్రదేశ్ ను ఓ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ప్రపంచ దృష్టిని ఆకర్షించి, అమరావతికే తలమానికంగా నిలిచేలా భవానీ ద్వీపాన్ని మరింతా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భూమా అఖిలప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఏపీటీడీసీ ఛైర్మన్‌ జయరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.