లాలు ప్రసాద్ ని దోషిగా తేల్చిన రాంచి సీబీఐ కోర్టు...

SMTV Desk 2017-12-23 16:27:55  lalu prasad yadav, fodder scam, final judgement, ranchi cbi court

రాంచి, డిసెంబర్ 23: 20సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్ ను రాంచి సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో లాలుతో సహా మొత్తం 15మందిని కోర్టు దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. కాగా ఈ కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాధ్ మిశ్రా సహా ఎడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు జనవరి 3న శిక్షలు ఖరారు చేయనున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ రోజు తీర్పు నేపథ్యంలో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వియాదవ్‌ రాంచీ కోర్టుకు చేరుకున్నారు. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో లాలూ మద్దతుదారులు భారీగా న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. 1990-97 మధ్య లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా దాణా కొనుగోళ్లలో రూ.900 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులకు సంబంధించి 2013లో ఓ కేసులో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 2013లో ఐదేళ్ల శిక్షతో ఎన్నికల్లో ఆయన అనర్హుడయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ దాణా కుంభకోణం కేసును రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ఈ మేరకు ఆయనను దోషిగా నిర్దారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించగా ఆయనను రాంచి కోర్టుకు తరలించారు.