అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒరిస్సా మ౦త్రిపై వేటు

SMTV Desk 2017-12-23 15:50:50  orissa, minister, contrevorcial comments, damoder rout, naveen patnayak

భువనేశ్వర్, డిసెంబర్ 23: ప్రజామోదంతో వరుసగా నాలుగుసార్లు ఒరిస్సా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నవీన్ పట్నాయక్ కు తన సహచర మంత్రి నుంచి తలనొప్పి ఎదురైంది. బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవసాయశాఖ మంత్రి దామోదర్ రౌట్‌ను తన మంత్రిమండలి నుంచి తొలగిస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఏదైనా కులం, మతం, వర్గం పట్ల ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అందుకే మంత్రి దామోదర్‌ను తొలిగించానని, దీనికి సంబంధించిన లేఖను గవర్నర్‌కు పంపినట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 18న మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి దామోదర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రజలు ఎంతటి దుర్భర పరిస్థితిలోనూ యాచించరు అని, కానీ కఠిన పరిస్థితులు వస్తే బ్రాహ్మణులు అడుక్కుంటారని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై బ్రాహ్మణ వర్గం తీవ్ర నిరసనలు చేపట్టింది. ఇటు బీజూ జనతాదళ్ పార్టీ కూడా ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో సీఎం పట్నాయక్ మంత్రి దామోదర్‌ను తొలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాలక, ప్రతిపక్ష వర్గాలు సీఎం నిర్ణయాన్ని స్వాగతించాయి. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.