నేటి నుండి పీబీఎల్‌ పోరు షూరు...

SMTV Desk 2017-12-23 14:06:18  pbl season 4, guvahathi, chennai smashers, p.v sindhu

గువహాటి, డిసెంబర్ 23 : ఓ వైపు భారత క్రీడాభిమానులకు ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) అలరిస్తుండగా, మరోవైపు బ్యాడ్మింటన్‌ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) సీజన్‌–4 సిద్దమైంది. ఈ రోజు జరిగే ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ జట్టు, అవధ్‌ వారియర్స్‌తో ఢీకొట్టనుంది. మహిళల సింగిల్స్‌ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్‌ తరఫున సైనా నెహ్వాల్‌ తొలి మ్యాచ్‌లో పోటీ పడనున్నారు. లీగ్ ఆరంభంలోనే భారత మేటి షట్లర్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. సీజన్‌–3 లో ఆరు జట్లతో ఈ టోర్నీ నిర్వహించగా, ఈ సారి మరో రెండు జట్లు అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ జట్లు కొత్తగా వచ్చి చేరాయి. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి.ఈ టోర్నీలో పురుషుల, మహిళల ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకర్లు విక్టర్‌ అక్సెలెసన్‌ (డెన్మార్క్‌), తై జుయిఇంగ్‌ (తైవాన్‌)లతో పాటు ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించిన 8 మంది, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన 9 మంది ఈ సీజన్‌లో ఆయా జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. 2013 ఆగస్ట్ 14 న ప్రారంభమైన ఈ పీబీఎల్ మూడో సీజన్ ను ముంబై రాకెట్స్ ను, ఓడించి చెన్నై స్మాషర్స్‌ జట్టు ట్రోఫిని ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏ జట్టు విజేతగా నిలుస్తుందో జనవరి 24 న జరిగే ఫైనల్లో తేలనుంది.