కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్ర పర్యావరణశాఖ తుది అనుమతులు...

SMTV Desk 2017-12-23 13:06:54  kaleswaram, project, final permissions, telangana, kcr, central environmental dept

హైదరాబాద్, డిసెంబర్ 23: తెలంగాణ మాసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్ర పర్యావరణ శాఖ తుది అనుమతులను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం(2017 చట్టం) ప్రకారం ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణశాఖ తన తుది ఆదేశాల్లో స్పష్టంచేసింది. ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు రావడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. గోదావరి జలాలతో తెలంగాణ పంటపొలాల దాహార్తి తీర్చడానికి ఇక అత్యంత వేగంగా పనులు జరిపిస్తామని ఆయన తెలిపారు. పర్యావరణశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కెర్‌కెట్ట అనుమతి లేఖను కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాంకు పంపించారు. ఈ అనుమతి లేఖ పదేండ్లపాటు చెల్లుబాటు (వ్యాలిడ్)లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో 34,684 హెక్టార్ల మేర భూమిని సేకరించడం జరుగుతుంది. పునరావాసం, పునర్నిర్మాణం ప్రయోజనాలను భూసేకరణ చట్టం-2013 ప్రకారం అమలుచేయాలి. ఇదికాకుండా ప్రాజెక్టు ద్వారా భూమిని కోల్పోతున్నవారికి పరిహారం చెల్లించేందుకు అందుబాటులో ఇంకేదైనా చట్టం ఉంటే దాని ప్రకారం ప్రయోజనాలను కల్పించవచ్చు. ప్రాజెక్టు పరిధిలో పర్యావరణానికి విఘాతం కలగకుండా అందుకు కేటాయించిన నిధులను వాటికే వెచ్చించాలని లేఖలో పేర్కొన్నారు.