బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడండి: పవన్ కళ్యాణ్

SMTV Desk 2017-12-23 12:30:29  pavan kalyan, janasena party, visakapatnam

హైదరాబాద్, డిసెంబర్ 23: భూ కబ్జాల దాడిలో ఓ మహిళపై జరిగిన అరాచకానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ నెల 20న విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో భూకబ్జాను అడ్డుకున్న ఓ దళిత మహిళపై టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఈ ఘటనపై పవన్ తన జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వరుస ట్విట్లు చేశారు. " పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ మహిళను నిస్సహాయురాలిని చేసి కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆమె ఏ వర్గానికి చెందిన మహిళ అయినా, అక్కడ దాడికి కారణం ఏదైనా, అలా చేయడం మాత్రం న్యాయం కాదు. నేను నేరుగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అధికారులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అలా జరగకుండా బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడండి. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు వివరణ కోరుతున్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేక సంకేతాల వెళ్తాయి. గతంలో కారంచేడు, చుండూరు ఘటనల్లోనూ ఇలాగే జరిగింది. దీనికి ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలి. రోహిత్‌ వేముల ఘటనను గుర్తుతెచ్చుకోండి. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలను మీడియా సెన్సేషనల్‌ చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. విశాఖపట్నం పోలీసు కమిషనర్‌, కలెక్టర్‌ బాధితురాలికి అండగా ఉంటూ ఆమెకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి. త్వరలోనే జనసేన కార్యకర్తలు విశాఖ వెళ్లి బాధిత మహిళను పరామర్శిస్తారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండాలంటే, అసెంబ్లీలో అధికార తెదేపా-భాజపా, ప్రతిపక్ష వైకాపా విమర్శలకు పోకుండా చర్చలు జరపాలని" కోరుతూ ట్విట్ చేశారు.