అసత్య ప్రచారాలే భాజపా పునాదులు: రాహుల్

SMTV Desk 2017-12-23 11:06:44  cwc meeting, cwc, congress, rahul gandhi, comments, bjp, modi

న్యూ డిల్లీ, డిసెంబర్ 23: యూపీఏ హయంలో నమోదైన కేసులు కేవలం వదంతులు, ఊహాగానాలు, సాక్ష్యాధారాలు లేనివని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా వివిధ కోర్టులు ఇస్తున్న తీర్పులే ఇందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. తప్పుడు కేసుల ఆధారంగా బీజేపీ తమపై అసత్య ప్రచారాలు చేసిందని, ఆ పార్టీ అబద్ధపు పునాదులపై నిర్మించబడిందని రాహుల్ దుయ్యబట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్‌ తొలిసారిగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..లక్షలాది కోట్ల రూపాయల 2జీ స్కాం అంటూ మోదీ తప్పుడు సమాచారంతో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేశారన్నారు. ఒక అబద్ధాన్ని సృష్టించి దానిని ప్రచారం చేయటం, ప్రజలు నమ్మేదాకా పదేపదే అదే అబద్ధాన్ని చెప్పటం బీజేపీ చేసే కుట్ర అని ఆయన తెలిపారు. మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఆజాద్, తదితరులతో పాటు రాష్ట్రాల అధ్యక్షులు హాజరైన ఈ సమావేశంలో పార్టీకి మార్గదర్శకత్వం వహించి, ఎనలేని సేవలు అందించిన మాజీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ సీడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు సన్నద్ధతపైనా సమాలోచనలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ అంశం, నిర్మాణాత్మకంగా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల వ్యాఖ్యలు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయని సీడబ్ల్యూసీ పేర్కొంది. బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలని సమావేశం తీర్మానించింది.