అశోక్ చవాన్‌కు ఊరటనిచ్చిన ముంబై హైకోర్టు

SMTV Desk 2017-12-22 13:16:06  Adarsh Housing Society scam, ashok chawaan, former chief minister, mumbai

ముంబై, డిసెంబర్ 22 : ఆదర్శ్‌ కుంభకోణంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ముంబై హైకోర్టు ఊరటనిచ్చింది. కేసు దర్యాప్తులో సీబీఐ సాక్ష‍్యాలు సమర్పించకపోవటంతో ఆయన్ని తిరిగి విచారించేందుకు అనుమతి ఇస్తూ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చవాన్‌ హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు శుక్రవారం ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ సీఎం తరహా వ్యక్తులపై విచారణ చేపట్టాలంటే అందుకు సంబంధించి ఉత్తర్వులు ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చల అనంతరం గవర్నర్‌ ఈ ఉత్తర్వులను వెలువరించారు. అయినా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించలేదు. 2010లో ఆదర్శ్ హౌజింగ్ సోసైటీ స్కాం వెలుగులోకి రాగా, చవన్‌ రాజీనామా చేసి ఆ స్థానంలో పృథ్వీరాజ్‌ సీఎంగా పగ్గాలు చేపట్టారు. అమర జవాన్ల కుటుంబాల కోసం ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఆదర్శ్ సొసైటీ భవనాన్ని నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన బంధువులకు ఇళ్లు ఇప్పించడంతో ఈ కేసులో ఇరుక్కున్నారు.