రోజు రోజుకు పెరిగిపోతున్న పైరసీ మాఫియా...

SMTV Desk 2017-12-22 11:53:12  piracy, movie piracy, jawan movie, garudavega, bahubali.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఎంతో మంది టేక్నిషియన్ లు, దర్శకుడు, హీరో, హీరోయిన్ నెలల పాటు ఎండ,వాన,చలి అని తేడా లేకుండా శ్రమించి సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందిరా దేవుడా..! ఇక ఈ సినిమాపై ప్రేక్షక దేవుళ్లు ఏవిధంగా స్పందిస్తారో.. అని చిత్ర బృందం సందిగ్ధంలో ఉంటే... వారి కష్టాన్ని తృణప్రాయంగా ఎంచి... రోజు రోజు కు పైరసీ మాఫియా చెలరేగిపోతుంది. ఈ పైరసీ వల్ల ఎంతో మంది నిర్మాతలు తమ ప్రాణాలు విడిచిన సంఘటనలూ లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ సగౌరవంగా చెప్పుకునే ‘బాహుబలి’ చిత్రానికి సైతం పైరసీ వ్యాధి తప్పలేదు. ఇటీవల విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ ‘జవాన్’ ‘గరుడవేగ’ సినిమాలు ఈ పైరసీ వలలో పడినవే. సినిమాలు రిలీజైన వెంటనే విద్యార్థులకు, ధియేటర్ యాజమాన్యాలకు డబ్బు ఎరగా వేసి, హెచ్ డి క్లారిటీతో సినిమా ను పైరసీ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. మరి కొందరు మీ సినిమా హెచ్ డి ప్రింట్ మాదగ్గర ఉంది అంటూ ఆ చిత్ర నిర్మాతలే బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు భయపడిన కొందరు నిర్మాతలు కోట్లలో సొమ్ములు ముట్టజెప్పిన విషయాలు వెలుగు చూసాయి. మరి కొందరు పోలీసులను ఆశ్రయించారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన జవాన్ సినిమా విడుదల సమయంలో నిర్మాత కృష్ణయ్యకు మీ సినిమా పైరసీ మా వద్ద ఉంది అంటూ ఫోన్ రావడంతో... ఆయన సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు సభ్యుల పైరసీ ముఠాను వారు అరెస్ట్ చేసి, విచారించగా గతంలో కూడా గరుడవేగ చిత్ర నిర్మాతలను బెదిరించి డబ్బు దండుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తుందని పోలీసులు గుర్తించారు. నిర్మాతల వద్ద నుండి తీసుకునే డబ్బు బెంగుళూరు ఖాతాలకు పంపించి, అక్కడ నుండి షేర్, బిట్ కాయిన్ రూపంలో చెలామణి చేస్తున్నట్లు సీసీఎస్‌ సైబర్‌క్రైం అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. పైరసీ మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక టీంలకు ఏర్పాటు చేస్తామన్నారు. పైరసీని ప్రజలు కూడా ప్రోత్సహించకూడదని సూచించారు.