భారత్‌తో సంబంధాలను పునరుద్దరించ౦డి: పాక్ ఆర్మీ చీఫ్‌

SMTV Desk 2017-12-21 16:24:33  pakistan, india, relations, pak army, khamar javed bajwa

లాహోర్, డిసెంబర్ 21: భారత్, పాక్ మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించాలని పాక్ ఆర్మీ పేర్కొంది. భారతదేశంతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి ప్రభుత్వ౦ తీసుకురావాలని ఆయన పార్లమెంట్‌ సెనెట్‌ కమిటీకి చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకునే ఈ చొరవను సైన్యం అభినందించడంతో పాటు, అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత్‌ సహా ఇతర పొరుగు దేశాలతోనూ పాకిస్తాన్‌ తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సెనెట్‌ కమిటీకి తెలిపారు. పాకిస్తాన్‌ అభద్రతతో అస్థిరపడకూడదని అన్ని దేశాలతో మంచి సంబంధాలను కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్‌ కమిటీ సమావేశంలో జావేద్‌ బజ్వాతో పాటు ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్ చీఫ్‌ నవీద్‌ ముఖ్తార్‌, మేజర్‌ జనరల్‌ సాహిర్‌ సంషాద్‌ మీర్జాచ మరో మేజర్‌ జనరల్‌ ఆషిమ్‌ మునీర్‌ పాల్గొన్నారు. పొరుగు దేశం భారత్‌తో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో భారత్‌ తో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను సానుకూల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన స్పష్టంచేశారు.