జైలుశిక్ష పూర్తిచేసిన తొలి సిట్టింగ్‌ జడ్జి..!

SMTV Desk 2017-12-21 13:05:33  former justice karnan, jail, release, six months

కోల్‌కతా, డిసెంబర్ 21: సిట్టింగ్‌ జడ్జిగా ఉంటూ సుప్రీంకోర్టును విమర్శించి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ ఆరు మాసాల జైలు శిక్ష అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ధిక్కార నేరం కింద కర్ణన్‌ కు ఆరునెలలపాటు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిక్ష పూర్తిచేసుకున్న ఆయన ఈ రోజు కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు గాను ఆయనపై మే 9న అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆయన కొంతకాలం పాటు అజ్ఞాతంలో గడిపారు. అనంతరం జూన్‌ 20వ తేదీన కోయంబత్తూరులో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దేశంలో జైలు శిక్ష అనుభవించిన తొలి సిట్టింగ్‌ జడ్జి ఆయనే కావడం విశేషం.