నేడు సత్యాగ్రహ ఆశ్రమ శతవార్షికోత్సవాలు

SMTV Desk 2017-06-17 17:50:58  Salt Satyagraha, Salt Satyagraha, Saturday is a centenary celebration

అహ్మదాబాద్, జూన్ 17 : భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఉద్యమంలో కీలక ఘట్టాలయిన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుంచే ప్రారంభమైయ్యాయని భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించారు. భారతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి, దేశవాసులకు స్వేచ్ఛా వాయువులను ప్రసాదించడంలో కేంద్ర బిందువుగా నిలిచిన సబర్మతీ ఆశ్రమం శనివారం శతవార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదుకి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతీ నది ఒడ్డున స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. గాంధీ తన భార్య అయిన కస్తూర్భా తో పాటు ఇక్కడ పన్నెండేళ్ళు నివాసమున్నారు. 1917 జూన్‌ 17న ఈ ఆశ్రమం ప్రారంభమైంది. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇది ప్రధాన కేంద్రంగా నిలిచింది. 1930 మార్చి 12న దండి యాత్రను గాంధీ ఇక్కడి నుంచే ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇక్కడికి తిరిగిరానని నాడు ఆయన ప్రతినబూనారు.శతవసంత వేడుకల సందర్భంగా ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు శనివారం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆశ్రమంలో రెండు శాశ్వత గ్యాలరీల ఏర్పాటు, మొక్కల నాటడం, గాంధీపై రెండు పుస్తకాల విడుదల వంటివి ఇందులో ఉంటాయి. మహాత్మా గాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాల కృష్ణ గాంధీ సమక్షంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఆశ్రమానికి గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని పేర్లున్నాయి.