స్పిన్ తో తిప్పేశారు.. కటక్ లో కొట్టేశారు...

SMTV Desk 2017-12-20 23:13:27  cuttack, india, srilanka, india won, 1 st t-20,

కటక్, డిసెంబర్ 20 : భారత్ జైత్ర యాత్ర కొనసాగుతుంది.. శ్రీలంక జట్టుపై టెస్టు, వన్డే సిరీస్ లను దక్కించుకున్న రోహిత్ సేన అదే విజయోత్సాహంతో కటక్ లో కదం తొక్కింది. బారాబతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ- 20లో రోహిత్ సేన 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఇండియా టీంకు అంతర్జాతీయ టీ-20 లో ఇదే భారీ విజయం కావడం విశేషం. భారత్ జట్టు నిర్దేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక లంక సేన 16 ఓవర్లకు 87 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ విజయంతో మూడు టీ-20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టాస్ నెగ్గి ప్రత్యర్థి జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వని౦చింది. ఓపెనర్లుగా వచ్చిన టీమిండియా సారధి రోహిత్ 17 పరుగులతో నిరాశ పరిచిన కే.ఎల్. రాహుల్ (61) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ స్కోర్ 101 వద్ద ప్రదీప్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(24)కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి రెండవ వికెట్ గా వెనుదిరిగాడు. తర్వాత రాహుల్ లంక కెప్టెన్ పెరీరా వేసిన స్లో బంతిని తప్పుగా అంచనా వేసి బౌల్డ్ గా పెవిలియన్ కు చేరాడు. అనంతరం వచ్చిన ధోని (39), పాండే (32) పరుగులుతో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరి జోడితో లంక బౌలర్లను తమదైన శైలిలో ఉతికి ఆరేశారు. ప్రదీప్ వేసిన 19 ఓవర్లలో ధోనీ ఒక ఫోర్ కొట్టగా, మనీశ్ పాండే వరుసగా సిక్స్, ఫోర్ తో భారత్ ఏకంగా 21 పరుగులను తన ఖాతాలో వేసుకుంది. చివరి ఓవర్ ఆఖరి బంతిని ధోని అద్భుతమైన సిక్స్ కొట్టడంతో భారత్ 180 పరుగులు చేసింది. లంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్‌, తిసారా పెరీరా, నువాన్‌ ప్రదీప్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక జట్టును స్పిన్నర్ చాహల్ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆరంభంలో జయదేవ్ ఉనద్కత్ రెండో ఓవర్ లో డిక్వెల్ (13) వికెట్ తీసి టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు. తర్వాత వచ్చిన ఉపుల్ తరంగా (23) మాధ్యుస్ (1), అసేల్ గుణరత్నె(4), కెప్టెన్ పెరీరా(4) లను మణికట్టు మాంత్రికుడు యజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయజాలంతో పెవిలియన్ కు పంపాడు. మరో వైపు కులదీప్ యాదవ్ కూడా కుశాల్ పెరీరా (19), దషున్ శనక (1) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరిలో హార్దిక్ పాండ్య (3/29) విసిరిన బౌన్సర్ బంతులకి లంక ఆటగాళ్లు వికెట్లను సమర్పించుకున్నారు. "మ్యాన్ అఫ్ ది మ్యాచ్" గా 4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చాహల్ ఎంపికయ్యాడు. కాగా రెండో టీ-20 ఈ నెల 22న ఇండోర్ వేదికగా జరగనుంది. *భారత్ జట్టు స్కోర్ 180/3 (20 ఓవర్లు) *శ్రీలంక జట్టు స్కోర్ 87/10 (16 ఓవర్లు)