క్రీస్తుశకం 8వ శతబ్దిలో భారత్ కు పర్షియన్ల వలస

SMTV Desk 2017-06-17 17:22:54  parsi, gujarath ,eran,pakistan, geinom,

హైదరాబాద్ జూన్17‌: భారత్‌కు 1,200 ఏళ్ల క్రితమే పర్షియ (నేటి ఇరాన్‌) నుంచి వలస వచ్చిన వారు పార్శీలని చరిత్ర చెబుతుంది. క్రీస్తు శకం 8–10 శతకంలో తొలి పార్శీ గుజరాత్‌కు వచ్చి, ఆ తరువాత దేశమంతా విస్తరించారని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలో ఈస్టోనియా, యూకే, పాకిస్తాన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు. భారత్, పాకిస్తాన్‌లలో స్థిరపడ్డ పార్శీలు, గుజరాత్‌లోని సంజన్‌ ప్రాంతంలో బయటపడ్డ పార్శీల అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను పరిశీలించడం ద్వారా వారు సుమారు 1,200 ఏళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చినట్లు నిర్ధారించామని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జన్యుపరంగా పార్శీలు నియోలిథిక్‌ ఇరానియన్లకు దగ్గరి వారని ఆయన చెప్పారు. మైటోకాండ్రియల్, వై–క్రోమోసోమల్, ఆటోసోమల్‌ డీఎన్‌ఏ మార్కర్లను ఈ పరిశోధనలో పరిశీలించామని, ఈ ఫలితాలు చరిత్ర పుస్తకాలతో సరిపోలుతున్నాయని సాంగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఖాసీం అయూబ్‌ పేర్కొన్నారు. భారత్‌పై ముస్లిం రాజుల దండయాత్రల ప్రభావం పార్శీలపై ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని ఈస్టోనియా బయోసెంటర్‌ శాస్త్రవేత్త జ్ఞానేశ్వర్‌ చౌబే తెలిపారు పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక జీనోమ్‌ బయాలజీ మేగజైన్‌లో ప్రచురితమయ్యాయి.