ఢిల్లీలో 100 మందికి పైగా అమ్మాయిలను బంధించారు...

SMTV Desk 2017-12-20 17:24:34  delhi, 100 numbers girl, Hell Sexual assaults

న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : భగవంతుడి పేరుతో బోధనలు చేస్తామని చెబుతూ... అమ్మాయిలను ఆశ్రమానికి తీసుకొచ్చి మరి, నరకం అంటే ఏంటో చూపించిన ఘటన దేశరాజధానిలోని ఓ ఆశ్రమంలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ‘ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం’ అనే ఆశ్రమం ఉంది. బోధనల పేరుతో ఇక్కడ అమ్మాయిలను కొన్నేళ్లుగా బంధించారని, వారి కుటుంబసభ్యులను కూడా కలిసేందుకు అనుమతినివ్వట్లేదని స్థానిక ఎన్జీవో ఆరోపిస్తూ, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి వెంటనే స్పందించిన న్యాయస్థానం వెంటనే ఆశ్రమంలో తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశించడంతో, ఈ నెల 19న ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. అక్కడ అమ్మాయిల పరిస్థితి చూసిన పోలీసులు నివ్వరపోయారు. ఇనుప గ్రిల్స్‌లో 100 మందికి పైగా అమ్మాయిలు అక్కడ బంధీలుగా ఉన్నారు. కనీసం స్నానం చేసేందుకు కూడా వారిని ఒంటరిగా పంపడం లేదని చెప్పారు. ఈ అమ్మాయిలపై అనేక సార్లు అక్కడి సాధువులు లైంగిక దాడులకు పాల్పడినట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు ఆశ్రమంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని పోలీసులు పట్టించుకోలేదని ఎన్జీవో పేర్కొంది. ఇప్పటికే ఆశ్రమంలో కొందరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసులపై కూడా పోలీసులు విచారించాలేదని తెలిపారు. దీంతో నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. 15 రోజుల్లోగా ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని కోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.