వడ్డీ రూప౦లో సీబీడీటీ రూ.58వేల కోట్లు వృధా: కాగ్

SMTV Desk 2017-12-20 14:10:44  cbdt, interest, waste, money, caag

న్యూ డిల్లీ, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల సంస్థ వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తో౦ద౦టూ భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్ ఆరోపించింది. ఈ మేరకు కాగ్‌ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. వ్యక్తులు లేదా సంస్థలు కట్టిన ఆదాయపు పన్నులో కొంత మొత్తాన్ని రీఫండ్‌ రూపంలో తిరిగి ఆయా వ్యక్తులు, సంస్థలకు చెల్లిస్తుంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల సంస్థ(సీబీడీటీ). అయితే కొన్నిసార్లు ఈ రీఫండ్‌ ఇవ్వడం ఆలస్యం అవుతుంది. అలాంటప్పుడు దానికి వడ్డీ కూడా చెల్లిస్తారు. అలా గత 9 సంవత్సరాల్లో కేవలం రీఫండ్‌కు ఇచ్చే వడ్డీ కోసం సీబీడీటీకి అక్షరాలా.. రూ.58,500 కోట్లు ఖర్చు చేసిందని కాగ్ ఆరోపించింది. పార్లమెంట్‌ ఆమోదం లేకుండానే ఇలా అదనపు ఖర్చులు చేస్తున్నారని సీబీటీడీ, రెవెన్యూ శాఖలపై కాగ్‌ విమర్శలు గుప్పించింది. ఇలా చేయడం వల్ల ప్రజాధనం వృధా అయ్యి, బడ్జెట్‌కు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆరోపించింది. రెవెన్యూ లోటుతో ప్రభుత్వం ఇబ్బంది పడవలసి వచ్చే ప్రమాదం ఉందని కాగ్ హెచ్చరించింది. అయితే సీబీడీటీ మాత్రం తాము ఆర్థికశాఖ అనుమతి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.