భర్త ద్రోహానికి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

SMTV Desk 2017-12-20 13:58:16  Mothers suicide with two children, kodapoor mandal, Mahbubnagar

మహబూబ్‌నగర్‌, డిసెంబర్ 20 : భర్త మరో పరాయి యువతితో వెళ్లిపోయాడని తట్టుకోలేకపోయిన భార్య మనస్తాపం చెంది, తన ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొండాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ పార్థసారధి తెలిపిన కథనం ప్రకారం.. కొండాపూర్‌ గ్రామానికి చెందిన మొద్ది సత్తెయ్య ఇదే మండలం తోమాల్‌ గ్రామానికి చెందిన వడ్డే యశోదను పదేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానంగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొద్ది కాలంగా భర్త అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో పాటు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. దీన్ని తట్టుకోలేని భార్య ఆయన దగ్గరికి వెళ్లి, ఇంటికి రావాలని కోరింది. దీనికి ఆయన ఒప్పుకోకపోగా, ఆమెపై తిరిగి దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురై మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి పిల్లలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మొద్ది సత్తెయ్య తమ కుమార్తెను, పిల్లలను చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు గ్రామ మాజీ సర్పంచి యాదయ్య ద్వారా సమాచారమందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.