నన్ను వెంటబడి వేధిస్తున్నారు- ట్రంప్

SMTV Desk 2017-06-17 16:39:39  America President Donald Trump,Rashya,Hillari klintan,Robert mular

వాషింగ్టన్‌, జూన్ 17 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తు చేస్తున్న అధికారులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. అధికారులను చాలా చెడ్డవాళ్ళుగా, దుర్మార్గులుగా వర్ణించారు. తాను న్యాయప్రక్రియకు అడ్డుపడ్డాననే కోణంలో ప్రత్యేక న్యాయవాది రాబర్ట్‌ మ్యూలర్‌ దర్యాప్తు చేస్తున్నారంటూ వెలువడిన కథనాలపై ట్రంప్ తనను ‘వెంటబడి వేధించటమే’ అని తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. దర్యాప్తు పక్షపాతంతో కూడుకున్నదని ఆరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌పై ఇలాగే ఎందుకు దర్యాప్తు చేయటంలేదని నిలదీశారు. ‘‘రష్యాతో హిల్లరీ క్లింటన్‌ కుటుంబం, డెమోక్రటిక్‌ నేతల లావాదేవీలను ఎందుకు పరిశీలించటం లేదు? నాకు సంబంధంలేని లావాదేవీలపై ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. ముందుగా రష్యా కథనాన్ని తప్పుడు సంబంధంతో ముడిపెట్టారని, తనపై దర్యాప్తు జరుగుతోందనే విషయాన్ని కూడా మరో ట్వీట్‌లో చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవటంపై మాత్రమే కాదు.. ట్రంప్‌ న్యాయ ప్రక్రియకు అడ్డుతగిలారా? అనేదానిపైనా మ్యూలర్‌ దర్యాప్తు చేస్తున్నట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఉన్నతస్థాయి అధికారులు కొందరు దర్యాప్తు అధికారుల ముందుకు రావటానికి అంగీకరించారనీ వివరించాయి. ఈ దర్యాప్తు రహస్యంగా కొనసాగుతోందని, ఎఫ్‌బీఐ ఎంతమందిని విచారించారన్నది స్పష్టం కాలేదని వెల్లడించాయి.